ఉత్తరాఖండ్ వరదల్లో మృత్యువాత పడినవారెంత మంది..? ప్రభుత్వం చెబుతున్నట్లు వారి సంఖ్య వెయ్యి లోపే ఉందా..? లేదా అంచనాలకందని స్థాయిలో మరణాలు సంభవించాయా..? దేశంలో ప్రజలందరినీ వేధిస్తున్న ప్రశ్నలివీ! ఓవైపు వరదల్లో చనిపోయినవారు వెయ్యి కన్నా తక్కువే ఉన్నారని ఉత్తరాఖండ్ ప్రభుత్వం చెబుతుంటే.. మరోవైపు ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గోవింద్‌సింగ్ కుంజ్వాల్ మాత్రం మృతుల సంఖ్య 10 వేలకు పైనే ఉండొచ్చని స్పష్టంచేశారు. ‘‘అధికారిక లెక్కల ప్రకారం మృతుల సంఖ్య 822గా ఉంది. నేను ఇంతకుముందు గర్వాల్ ప్రాంతంలో పర్యటించినప్పుడు 4 వేల నుంచి 5 వేల మంది వరకు చనిపోవచ్చని అనుకున్నా. 

కానీ ఇప్పుడు అందుతున్న సమాచారాన్ని బట్టి, ఆ విలయాన్ని ప్రత్యక్షంగా చూసినవారు చెబుతున్నదాన్ని బట్టి వారి సంఖ్య 10 వేలకు పైనే ఉండొచ్చని అనిపిస్తోంది..’’ అని కుంజ్వాల్ పేర్కొన్నారు. మట్టిదిబ్బలు, బురదలో పెద్ద సంఖ్యలో మృతదేహాలు కూరుకుపోయి ఉన్నాయని చెప్పారు. ఆయా ప్రాంతాల్లో అంటువ్యాధులు వ్యాపించకుండా ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని సూచించారు. శనివారం ఆయన అల్మోరాలో విలేకరులతో మాట్లాడారు. మరోవైపు శుక్రవారం రాత్రి వరకున్న సమాచారం మేరకు మృతుల సంఖ్య 900గా ఉందని, ఇప్పటిదాకా 1.05 లక్షల మందిని కాపాడినట్లు కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే ముంబైలో చెప్పారు. మట్టి దిబ్బలు, కొండ చరియల తొలగింపు తర్వాతే ఎందరు మరణించారన్న అంశంపై ఓ అంచనాకు రాగలమని, ప్రస్తుతానికైతే వెయ్యి దాకా చనిపోయి ఉండవచ్చని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి విజయ్ బహుగుణ పేర్కొన్నారు. ఉత్తరాఖండ్‌లో సహాయక చర్యల్లో పాలుపంచుకుంటున్న జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ (ఎన్‌డీఎంఏ) లెక్క మరోలా ఉంది. శుక్రవారం సాయంత్రం వరకు మృతుల సంఖ్య 580 మాత్రమేనని తెలిపింది. ఇక ఆచూకీ లేని వారి సంఖ్య అధికారికంగానే 3 వేల దాకా ఉందని ఉత్తరాఖండ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) సుభాష్ కుమార్ తెలిపారు.

చెట్లకు వేలాడుతున్న శవాలు..: కేదార్‌నాథ్‌లో ఎంత భయానకంగా మారిందో అక్కడి పరిస్థితులను ప్రత్యక్షంగా చూసి వస్తున్నవారి మాటలను చూస్తే తెలుస్తోంది. కేదార్‌నాథ్ మార్గంలో రాంబడ, గౌరీకుండ్, జంగల్‌చెట్టీ లాంటి గ్రామాలున్నాయి. ఈ గ్రామాలకు చెందినవారు కేదార్‌నాథ్‌లో చిన్నచిన్న వ్యాపారాలు చేసుకుంటారు. వరదల్లో కుటుంబీకులు, తమ బంధువులు తప్పిపోవడంతో వీరంతా కేదార్‌నాథ్ వెళ్లి వారి ఆచూకీ కోసం వెతుకుతున్నారు. 

వీరితోపాటు పలు రాష్ట్రాలకు చెందినవారు కూడా అక్కడికి వెళ్లి ఆత్రంగా బంధుమిత్రుల కోసం వెతుకుతున్నారు. వీరిలో నిరాశతో వెనుదిరుగుతున్న కొందరు కేదార్‌నాథ్‌లో ప్రత్యక్షంగా చూసిన భయానక అనుభవాలను వివరిస్తున్నారు. ‘‘అక్కడికి వెళ్తే తప్పిపోయిన మీవారి గురించి విలపించరు. ఆ విలయాన్ని చూసి ఏడుస్తారు. ఎక్కడికక్కడ మృతదేహాలు పడి ఉన్నాయి. కొన్ని చెట్లకు వేలాడుతున్నాయి. మరికొన్ని బండల మధ్య ఇరుక్కుపోయాయి. ఇంకొన్ని నదీ తీరం వెంట పడి ఉన్నాయి. చాలా శవాలు గుర్తుపట్టలేనంతగా కుళ్లిపోయాయి. వాటి నుంచి భరించలేని దుర్వాసన వస్తోంది’’ అని శ్యామల్ శర్మ అనే వ్యక్తి చెప్పారు. రాంబాడలో ఈయన బంధువుల కుటుంబం వరదలో కొట్టుకుపోయింది.

స్థానికులు, వలస వచ్చిన వారి వివరాలేవీ?
కేదార్‌నాథ్ చుట్టుపక్కల గ్రామాల్లోని అనేక మంది స్థానికుల వివరాలు కూడా ఇంకా లభ్యంకావడం లేదు. చార్‌ధామ్ యాత్రలో పాల్గొనే యాత్రికులకు వివిధ వస్తువులు విక్రయించేవారు, వారిని వేర్వేరు ప్రాంతాలకు తరలించేవారు అనేకమంది జీవనోపాధి కోసం ఇక్కడకు తరలివస్తుంటారు. నేపాల్, యూపీలోని వారణాసి నుంచి చార్‌ధామ్ యాత్ర సాగే సీజన్‌లో వందలమంది ఇక్కడకు వస్తారు. రుద్రాక్షలు, దేవుని ప్రతిమలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తూ ఉంటారు. అలాగే గుర్రాల ద్వారా యాత్రికులను తీసుకువెళ్లే 4,500 మంది ఇక్కడ బతుకుతుంటారు. నేపాల్ నుంచి దాదాపు 2 వేలమంది వచ్చి డోలీల్లో యాత్రికులను మోస్తారు. వీరిలెక్కలు ఎక్కడా లేవు. స్థానికంగా కూలీ పనులు చేసే పహాడీల జాడ కూడా కనిపించడంలేదు. సైనికులు చూసిన శవాలు, విపత్తు తీవ్రత, రక్షణ కోసం ఎదురుచూసినవారు అందించిన వివరాలను పరిశీలిస్తే మృతుల సంఖ్య 10 వేల కంటే ఎక్కువే అనడం అతిశయోక్తి కాదు.

వందల కిలోమీటర్ల మేర శవాలే..: వరదల్లో కొట్టుకుపోయిన చాలామంది తర్వాత శవాలై కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో తేలారు. హరిద్వార్ వద్దే దాదాపు 50కి పైగా మృతదేహాలు లభ్యమయ్యాయి. మరికొన్ని ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్, ముజఫర్ నగర్‌లో తేలాయి. ఇప్పటిదాకా ఉత్తరప్రదేశ్‌లోని గంగాతీరం వెంట 27 మృతదేహాలు వెలికితీశారు. ఇవన్నీ ప్రభుత్వ లెక్కల్లో ఉన్నాయా లేదా అన్నది తెలియడం లేదు.

సహాయక చర్యలకు మళ్లీ అంతరాయం..
ఆగుతూ కురుస్తున్న వర్షాల వల్ల శనివారం కూడా సహాయక చర్యలకు విఘాతం కలిగింది. వాతావరణం అనుకూలించిన సమయంలో బద్రీనాథ్, కేదార్‌నాథ్‌లో సహాయక చర్యలు కొనసాగాయి. మరోవైపు కేదార్‌నాథ్‌లో ఇప్పటిదాకా 34 మృతదేహాలకు అంతిమ సంస్కారాలు పూర్తికాగా, మట్టిదిబ్బల నుంచి మరో 12 శవాలను వెలికితీసినట్లు అధికారులు వెల్లడించారు. ఎక్కడికక్కడ తెగిపడిన అవయవాలు, రోజులు గడిచే కొద్దీ కుళ్లిపోతున్న మృతదేహాల వల్ల కేదార్‌నాథ్ పరిసరాలు దుర్వాసన వెద జల్లుతున్నాయి. దీంతో అంటువ్యాధులు ప్రబలకుండా చూసేందుకు సహాయక సిబ్బంది రసాయనాలు చల్లుతున్నారు.

శనివారం బద్రీనాథ్, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి 1,313 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వీరిలో 600 మందిని హెలికాప్టర్ల ద్వారా, మిగతావారిని కాలినడకన తరలించినట్లు సీఎస్ సుభాష్ కుమార్ పేర్కొన్నారు. ఇంకా 500 మందిని కాపాడాల్సి ఉందని వివరించారు. రుద్రప్రయాగ, చమోలీ, ఉత్తరకాశీ జిల్లాల్లో వరదలకు సర్వం కోల్పోయిన సుమారు 600 గ్రామాలకు తిండిగింజలు అందిస్తున్నట్లు చెప్పారు. ఆ గ్రామాలకు 2,379 టన్నుల గోధుమలు, 2,875 టన్నుల బియ్యాన్ని పంపినట్లు వివరించారు. తెహ్రీ జిల్లాలో 139, ఉత్తరకాశీలో 132, చమోలీలో 110, రుద్రప్రయాగలో 71 రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయన్నారు. కొద్దినెలల కిందటే 4 మెగావాట్ల విద్యుత్పత్తి సామర్థ్యంతో ప్రారంభమైన కలిగంగ-1 ప్రాజెక్టు వరదలకు పూర్తిగా కొట్టుకుపోయిందని, రూ.40 కోట్ల నష్టం వాటిల్లిందన్నారు. ప్రజా పనుల విభాగం, జల విద్యుత్ విభాగాల ప్రాథమిక అంచనా ప్రకారం రూ.800 కోట్ల వరకు నష్టం జరిగినట్లు తేలింది. ప్రభుత్వ శాఖలు ఇంకా నష్టం అంచనాను లెక్కగట్టే పనిలో ఉన్నాయి.

Tags: News, Telugu News, Andhra News

0 comments:

Post a Comment

 
Top