దిగ్విజయ్ సింగ్ మాటలు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు సానుకూలంగా ఉన్నా కాంగ్రెస్‌పై నమ్మకం తక్కువగా ఉందని తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష ఉప నేత మోత్కుపల్లి నర్సింహులు వ్యాఖ్యానించారు. మంగళవారం ఆయన ఇక్కడ ఎన్టీఆర్ భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. 'కాంగ్రెస్ పార్టీకి ఒకో ఇన్‌ఛార్జి వచ్చినప్పుడల్లా ఒకో మాట మాట్లాడుతున్నారు. అఖిలపక్ష సమావేశం పెట్టినప్పుడు నెలలో తెలంగాణ సంగతి తేలుస్తామని షిండే అన్నారు. నెలంటే నెల కాదని తర్వాత చెప్పారు. ఇప్పుడు దిగ్విజయ్ పది రోజులు అంటున్నారు. తర్వాత ఏమంటారో తెలియదు.

పంచాయతీ ఎన్నికల కోసం ఆ పార్టీ డ్రామా ఆడుతున్నట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్ ఇవ్వదల్చుకొంటే ఎవరు ఆపారు? అక్కడ ఒక మాట...ఇక్కడ ఒక మాట. కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మడం లేదు. హైదరాబాద్‌తో కూడిన తెలంగాణను మాత్రమే తెలంగాణ ప్రజలు కోరుకొంటున్నారు. కెసిఆర్, కాంగ్రెస్ పార్టీ చౌకబారు మాటలు మాట్లాడుతున్నారు. కేంద్రం నిర్ణయం తీసుకోవడం ముఖ్యం తప్ప మిగిలినవి కాదు. పార్లమెంటులో బిల్లు పెడితే మేం మద్దతు ఇస్తాం. అసెంబ్లీలో పెట్టినా మా మద్దతు ఉంటుంది' అని ఆయన అన్నారు. దిగ్విజయ్ మాటల్లో లోతు ఉంది... తమ పార్టీ...జగన్ పార్టీ డిఎన్ఎ ఒకటేనని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యల్లో లోతు ఉందని మోత్కుపల్లి అన్నారు.

Tags: Telugu News, Andhra News, News

0 comments:

Post a Comment

 
Top